ఇప్పటి వరకైతే ప్రతిపాదన రాలేదు..

 బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీవోకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌సీ ఖుంతియా స్పష్టంచేశారు. బీమా పాలసీలపై ఆదాయం పన్ను మినహాయింపును ఎత్తివేసేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వచ్చిన సంకేతాలపై ఖుంతియా స్పందిస్తూ అలాంటి ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టంచేశారు. అలాగే బీమా రంగ సంస్థలు  నష్టాలు తెచ్చే ప్రాడక్టుల నుంచి  బయటకు రావాలని ఆయన సూచించారు. . 




వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకైతే ఎల్‌ఐసీ ఎలాంటి ప్రతిపాదన పంపలేదని ఖుంతియా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఐపీవోకి రానున్న సంస్థల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఆయా సంస్థ పనితీరు మెరుగుపడనున్నదన్నారు. ప్రతి ఒక్క బీమా సంస్థ ఐపీవోకి రావాలనుకుంటున్నట్లు..చిన్న స్థాయి సంస్థలు ఇంకా బీమా రంగంలో కుదురుకోలేదని, వీటికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. గతేడాది జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగం 14 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇదే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కూడా 10 శాతం వృద్ధిని కనబరిచింది. 


 




 

Popular posts